తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకోనున్న రేవంత్ రెడ్డి.. 12 గంటలకు నామినేషన్ వేయనున్నారు.
నామినేషన్ అనంతరం కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే హామీలతో బీసీ డిక్లరేషన్ పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సభకు కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొని బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇక కామారెడ్డిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ గురువారం రోజునే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. తాను గెలిస్తే కామారెడ్డి రూపురేఖలు మార్చేస్తానని హామీ ఇచ్చారు. ఇరు ప్రధాన పార్టీల నేతలు ఇక్కడ పోటీలో ఉండటంతో కామారెడ్డి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.