తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ఈరోజుతో ముగియనుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ వారి అభ్యర్థుల జాబితాను దాదాపుగా ప్రకటించాయి. ఒక్క బీజేపీ మాత్రం ఇంకా పూర్తి జాబితాను విడుదల చేయలేదు. ఇప్పటికే నాలుగు విడతల్లో 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ గురువారం రాత్రి ఐదో జాబితాను విడుదల చేసింది. ఐదో విడతలో బీజేపీ కేవలం ఆరుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ ఆరుగురు అభ్యర్థులకు ఫోన్లు చేసి టికెట్ విషయాన్ని చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. పొత్తుల్లో భాగంగా జనసేనకు 8 స్థానాలను కేటాయించింది. ముందుగా ప్రకటించిన వంద మందిలో చాంద్రాయణ గుట్ట అభ్యర్థి అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో గురువారం రాత్రి ఆరు స్థానాల అభ్యర్థులను ప్రకటించగా.. మధిర, వికారాబాద్, నర్సంపేట, అలంపూర్, దేవరకద్ర, చాంద్రాయణ గుట్ట స్థానాలకు ఇంకా అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది.
ఆరు స్థానాలకు అభ్యర్థులు ఖరారు :
- మేడ్చల్ – ఎన్.రామచంద్రరావు
- నాంపల్లి – రాహుల్ చంద్ర
- సంగారెడ్డి – పులిమామిడి రాజు
- శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్
- పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్‌కుమార్
- కంటోన్మెంట్ – కృష్ణప్రసాద్