రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో ఓ ఘటన పెను దుమారం రేపింది. దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ హత్యాయత్నం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. అయితే ఈ హత్యను ఖండించిన బీఆర్ఎస్ నేతలు.. ఇది కాంగ్రెస్ పనేనని ఆరోపించారు. నిరాశలో ఉన్న కాంగ్రెస్ భౌతికదాడులకు దిగుతోందని విమర్శించారు.
బీఆర్ఎస్ ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని ఖండించిన రేవంత్.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో దాడులతో ప్రజల మనసును, ఎన్నికలను ఎవరూ గెలవలేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల నాడినే నమ్ముకుంటుందని.. హింసను ప్రేరేపించదని స్పష్టం చేశారు. ఎంపీపై దాడితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూసి కావాలనే కొందరు తమపై ఈ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఎవరైనా.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.