సమాజంలో అసాంఘికతకు, అశాంతికి కారణమయ్యే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను కూకటివేళ్లతో పెకిలించి తెలంగాణ రాష్ట్ర ఉన్నతిని తిరిగి నిలబెట్టుకునే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తలకెత్తుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకప్పుడు సామాజిక చైతన్య ఉద్యమాలకు నిలయమైన తెలంగాణ గడిచిన పదేండ్లలో గాడితప్పి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారడం పట్ల విచారం వ్యక్తం చేశారు.ఈ సమాజం మనది, దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే అనే స్పృహ ప్రతి ఒక్కరిలో కలగాలని, ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసులా వ్యవహరిస్తేనే సమాజంలో చెడు పోకడలను నియంత్రించడం సాధ్యమవుతుందని అన్నారు.
హైదరాబాద్ లోని జేఎన్టీయూ వేదికగా శనివారం “డ్రగ్స్ వ్యతిరేక పోరు, మహిళా భద్రత, రోడ్డు భద్రతలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల భాగస్వామ్యం” అనే అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు.టెక్నాలజీ దుష్ప్రభావాలు, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, కుటుంబ వ్యవస్థలో ఒడిదొడుకులు తప్పని నేటి పరిస్థితుల్లో మన భావితరాలను భద్రంగా కాపాడుకోవాలంటే కమ్యూనిటీ పోలీసింగ్ లో అందరూ భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాల బారిన పడి నిర్వీర్యమయ్యే దుస్థితి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో రావొద్దన్నారు. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల నిర్మూలన కోసం Telangana Anti Narcotics Bureau విభాగాన్ని పటిష్టంచేసి ఏకంగా యుద్ధం చేస్తున్న విషయాన్ని నొక్కి చెప్పారు. మాదకద్రవ్యాలపై చేస్తున్న యుద్ధంలో సామాన్య ప్రజలతోపాటు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు సైనికులై కదలిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.