గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ అమలు కోసం ప్రత్యేక నిధులు

-

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేద్దామని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నఅర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో ఉన్నారు.

రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్ లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news