నేనింకా ప్రమాణస్వీకారం చేయలేదు.. అధికారిక కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్‌

-

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సీఎంగా తన పేరును ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి పలు విషయాలు చర్చించారు. అనంతరం వారిని తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఇక బుధవారం రాత్రి 10.30 గంటలకు రేవంత్ రెడ్డి దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్‌ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికి.. ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసే కాన్వాయ్‌ (వాహనశ్రేణి)ని సిద్ధం చేశారు. అయితే రేవంత్‌ వారిని వద్దని వారించారు. తాను ఇంకా ప్రమాణ స్వీకారం చేయనందున వద్దంటూ తనతోపాటు దిల్లీ నుంచి వచ్చిన మాణిక్‌రావ్‌ ఠాక్రేతో కలిసి సొంత వాహనంలో విమానాశ్రయం నుంచి బయలుదేరారు. కానీ భద్రతా కారణాలరీత్యా కాన్వాయ్‌ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమదంటూ డీజీపీ తదితర అధికారులు వాహనశ్రేణితో రేవంత్‌ వాహనాన్ని అనుసరించారు.

Read more RELATED
Recommended to you

Latest news