తెలంగాణ లో రేషన్‌కార్డు లేనివారికి శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. రుణమాఫీకి రేషన్ కార్డు రూల్ కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కుటుంబ నిర్ధారణ కాగానే మిగతా వారికి కూడా రుణమాఫీ వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు.
BRS అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన రుణమాఫీ-2018 విధానాలనే ప్రస్తుతం తామూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే రూ.2 లక్షల మాఫీ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి….మార్గదర్శకాలు కావవి.. మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు అంటూ మండిపడ్డారు.
రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగం బాగుండాలని, తద్వారా విరివిగా ఉపాధి అవకాశాలు లభించాలని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు.