తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేయాలని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కోరారు.రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేసే వ్యవసాయ శాఖ పేరులో రైతు సంక్షేమం అనే పేరును కూడా జోడించాలని చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా పిలిచేవారని, అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖగా మాత్రమే మార్చారని, రైతు సంక్షేమం పేరు తొలగించారని చిన్నారెడ్డి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ – రైతు సంక్షేమం శాఖగా అమలు చేస్తున్నారని చిన్నారెడ్డి తెలిపారు.
రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొందని, అందులో భాగంగానే వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేయాలని చిన్నారెడ్డి కోరారు.వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేస్తే రైతులకు ఈ శాఖ తమ కోసం ఉన్నట్లుగా భావన కలుగుతుందని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేయాలని చిన్నారెడ్డి కోరారు.