నల్గొండ జిల్లాలో ప్రేమోన్మాది రోహిత్ అరెస్ట్

నల్గొండలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై ఓ ప్రేమొన్మాది హత్యాయత్యానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్న విద్యార్థి మీసాల రోహిత్ ఈ దారుణానికి ఓడిగట్టాడు. అయితే మీసాల రోహిత్ ను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపట్టారని తెలిపారు. సెక్షన్ 199/ 2022/U/s 307 సెక్షన్ లో కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే గతంలోనే జూలై 29న నిందితుడు బాధితురాలిని సీసాతో బెదిరించాడని చెప్పారు.

అయితే ఆమె పెళ్లికి నిరాకరించడంతోనే మరోసారి దాడికి పాల్పడ్డాడని ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. కానీ గతంలో వీరు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని అన్నారు. నిందితుడు హత్యకు పాల్పడతాడని మిగిలిన స్నేహితులు ఊహించలేదన్నారు. దాడి నుండి రక్షించుకోవడానికి బాధితురాలు అన్ని ప్రయత్నాలు చేసిందని.. అయినా విచక్షణ రహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే ప్రస్తుతం విద్యార్థినికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.