ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని తెలంగాణ సర్కార్ పేర్కొంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు.
సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సీఎం సూచించారు. లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు.