కేసీఆర్ అణచివేత సహించలేకే ఉద్యోగం వదులుకున్నా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ అణచివేత ధోరణి సహించలేకనే తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. తను ఉద్యోగంలో అలాగే కొనసాగి ఉంటే తనకు డీజీపీ పదవి వచ్చి ఉండేదని అన్నారు. కేసీఆర్ అణచివేత ధోరణిని అణిచివేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. బహుజనులు రాజకీయ బానిసలు కావొద్దని.. రాజ్యాధికారం సాధించుకుందామని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.

మంగళవారం రోజున హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో జరిగిన రాష్ట్ర వడ్డెర మహాసభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఉద్యమకారులపై కేసులు ఉన్నాయని, బడుగులకు రాజకీయ అవకాశాలు కల్పించకుండా అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజనుల రాజ్యాధికారం కోసం నిబద్ధతతో పని చేసేవారికి బీఎస్పీ అండగా ఉంటుందని తెలిపారు. బీఎస్పీ తరఫున పోటీ చేసే వారందరిని అసెంబ్లీకి పంపే బాధ్యత తీసుకుంటానని అన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news