తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ వెల్లివిరిస్తోంది. ఇవాళ కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో శివుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే ఆలయాలకు చేరుకుంటున్న భక్తులు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
ఈరోజు వేకువజాము నుంచే గోదావరి, కృష్ణా నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసి శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని వేములవాడ వంటి ప్రసిద్ధ శివాలయాలకు మాత్రమే కాకుండా భద్రాచలం, యాదాద్రి వంటి ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివయ్యకు అభిషేకాలు చేసి కార్తీక దీపం వెలిగించారు. మరోవైపు ఏపీలోని రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
నదుల్లో పుణ్యస్నానాల అనంతరం మహిళలు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్, కోటిలింగాల ఘాట్‌కు వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. కార్తీక సోమవారం కావడంతో ప్రముఖ ఆలయాల్లో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి.