తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. భక్తజనంతో యాదాద్రీశుడి ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే రద్దీ పెరగడంతో భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దర్శనానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది.
భక్తజనంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. కల్యాణకట్ట, పుష్కరిణి, ఘాట్ రోడ్డు వద్ద సందడి నెలకొంది. ఉదయం నుంచే స్వామి వారికి ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆలయ అష్టభుజి మండప ప్రాకారంలో నిర్వహించిన శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం క్రతువులో భక్త దపంతులు పాల్గొని వారి మొక్కులు తీర్చుకుంటున్నారు.
మరోవైపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న సంగీత మండపానికి హైదరాబాద్, నారాయణగూడకి చెందిన నవనీత్ రెడ్డి దంపతులు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులకు నవనిత్ రెడ్డి దంపతులు చెక్ అందజేశారు.