లోక్‌సభలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లు

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు రాష్ట్రానికి పసుపు బోర్డుతో పాటు సమ్మక్క సారక్క గిరిజిన విశ్వవిద్యాలయం కూడా మంజూరు చేస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విభజన చట్టంలో ఇచ్చిన ఈ హామీని త్వరలోనే నెరవేరుస్తామని ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా కీలక అడుగు ముందుకు పడింది. ఎట్టకేలకు కేంద్ర సర్కార్ తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

కేంద్ర యూనివర్సిటీల జాబితాలో ఈ విశ్వవిద్యాలయం పేరును చేర్చుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇప్పుడున్న చట్టానికి సవరణ ప్రతిపాదించారు. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా తెలంగాణలో ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాల్లో కేంద్ర సర్కార్ పేర్కొంది. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం వల్ల అక్కడి ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఈ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని.. ఇందుకోసం 2009 సెంట్రల్‌ యూనివర్సిటీల చట్టాన్ని సవరించి అందులో ‘సమ్మక్క సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ’ పేరును చేర్చుతున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం  ఏడు సంవత్సరాలలో రూ.889.07 కోట్లు ఖర్చు చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news