భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. సోమవారం మధ్యాహ్నాం 2 గంటలకు 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సాయంత్రం 10 గంటలకు 50 అడుగులు దాటిన నీటిమట్టం ఇవాళ ఉదయం 5 గంటలకు 51.5 అడుగులకు చేరింది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
వరద ముంచెత్తడంతో భక్తుల తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను మూసేశారు. స్నాన ఘట్టాలు కిందిభాగం, విద్యుత్తు స్తంభాలు మునిగాయి. కాళేశ్వరం, ఇంద్రావతి వైపు నుంచి పేరూరు మీదుగా భద్రాచలం వైపు వరద పోటెత్తడంతో ప్రతీ గంటకూ నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. గోదావరి నీటి మట్టం క్రమంగా పెగుతున్నందున ముంపు ప్రాంతాల సంఖ్య అంతకంకతకూ పెరుగుతోంది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాలతో భద్రాచలం పట్టణానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటిమట్టం 55 అడుగుల వరకు చేరుకునే ఉన్నందున ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.