సికింద్రాబాద్‌-ముంబయి మార్గంలో వందేభారత్‌ స్లీపర్‌ తొలి రైలు?

-

ప్రయాణికులకు శుభవార్త వందేభారత్‌ తొలి స్లీపర్‌ రైలు ఆగస్టులో పట్టాలు ఎక్కనుంది.  దేశంలోని ప్రధాన నగరాల మధ్య విడతలవారీగా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు సికింద్రాబాద్‌ – ముంబయి నగరాల మధ్య నడిపనున్నట్లు సమాచారం.

ఈ నగరాల మధ్య ఇప్పటివరకు వందేభారత్‌ రైళ్లు లేనందున తొలి స్లీపర్‌ రైలు ఈ మార్గంలో నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ జి.కిషన్‌రెడ్డి ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌కు తాజాగా సూచించారు. ఈ మేరకు ద.మ.రైల్వే జోన్‌.. రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు సికింద్రాబాద్‌ – పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో వందేభారత్‌ రైలు (సిట్టింగ్‌) రానున్నట్లు సమాచారం.

మరోవైపు కాచిగూడ-బెంగళూరు మధ్య 8 కోచ్‌లతో నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు డిమాండ్‌ బాగా ఉండటంతో దాన్ని 16 కోచ్‌లకు పెంచాలన్న డిమాండ్‌నూ ద.మ.రైల్వే పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తుది దశలో ఉన్న చర్లపల్లి టెర్మినల్‌ పనుల్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంపై ద.మ.రైల్వే దృష్టి సారించింది.

Read more RELATED
Recommended to you

Latest news