6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుదవారం సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని సఫాయి కాలనీ లో గృహ జ్యోతి కార్యక్రమం క్రింద జీరో బిల్లులు లబ్ధిదారులకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో రెండు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామని అన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం ద్వారా వేల మందికి లబ్ధి చేకూరిందని అన్నారు. గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.