కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమిపై తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ భూములపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేయలేదని అన్నారు. కేసు పదేళ్లు పెండింగ్లో ఉండటానికి గత ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ కృషితోనే 400 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చాయని అన్నారు. కుట్రపూరితంగానే ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ముఖ్యంగా ఈ అంశంలో సర్కార్ను బద్నా చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సోషల్
మీడియా వింగ్ పనిచేస్తోందని అన్నారు. వన్యప్రాణులను చంపుతున్నట్లు ప్రచారం చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతోనే కేంద్ర ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్ కి వచ్చిందని వెల్లడించారు. ఎంపవర్డ్ కమిటీ ఆ భూమి ప్రభుత్వానిదే నిర్దారణకు వచ్చిందన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కి వాస్తవాలతో కూడిన నివేదికను పంపినట్టు తెలిపారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కి వివరాలు పంపినట్టు చెప్పారు.