హిందీ బాషపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం 2023 ని ఎమ్మెల్సీ కవిత అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలోని సాహిత్యాన్ని ఆరాధిస్తామని.. కానీ ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
ఎవరి భాష వాళ్లకు ఉంటుందని..కానీ ఒకరిపై ఒకరు పెత్తనంచేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాధిస్తాం, ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా బ్రేక్ చేస్తామన్నారు. హిందీ చక్కటి భాష అని.. తనకు ఇష్టమైనదని అన్నారు. హిందీ పాటల్లో పదాలు అధ్భుతంగా ఉంటాయన్నారు. అయితే ఎవరి భాష వాళ్లకు ఉంటుందని.. ఒకరిపై ఒకరు పెత్తనం చేయొద్దని అన్నారు. తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు ప్రయాణించాల్సిన అవసరం ఉందన్నారు.