ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గోషామహల్ లో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా సురక్షితంగా ఉన్నారంటే కారణం పోలీసులే అన్నారు. తెలంగాణ పోలీసుల తీరును కేంద్రం మెచ్చుకుందని తెలిపారు.
మరోవైపు పోలీసులను సేవలను గుర్తించి.. విధుల్లో మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం కింద అందించనున్నట్టు ప్రకటించారు. ఐపీఎస్ కుటుంబాలకు రూ.2కోట్లు, డీఎస్సీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ కుటుంబాలకు రూ.1.50లక్షలు, ఇన్ స్పెక్టర్లకు రూ.1కోటి 25 లక్షలు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ కి రూ.కోటి నష్ట పరిహారం అందించనున్నట్టు తెలిపారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..శాశ్వతంగా అంగవైకల్యం చెందిన వారికి రూ.50లక్షలు అందించనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.