పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పరేడ్ కి రమ్మని రిటైర్డ్ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ను ఆహ్వానించారు. కానీ గ్రూపు-1 అభ్యర్థులు నిరసన చేపడుతుండటంతో నిన్న రాత్రి నుంచి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గృహ నిర్భంధంలోనే ఉంచారు. దీంతో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరేడ్ కి రమ్మని నిన్న రాత్రి నుంచి గృహ నిర్భంధంలో ఉంచడం ఎంత వరకు కరెక్ట్ అని ఆవేదన వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సోదరులకు నివాళులర్పించే అర్హత కూడా నాకు లేదా..? నేనేమైనా టెర్రరిస్ట్ నా..? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ విషయం పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆహ్వానించింది మీరే.. అరెస్ట్ చేసింది మీరే. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని పోలీసుల అమర వీరుల దినోత్సవం రోజు అవమానించడం సిగ్గు చేటు అన్నారు. పోలీసుల పట్ల మీ కపట ప్రేమకు ఇది మరో నిదర్శనం అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు ప్రభుత్వాలు పని చేయాలి.. కానీ ఇలా అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ.. నిర్భందించడం దుర్మార్గం అన్నారు హరీశ్ రావు.