కేటీఆర్ వద్ద పేపర్ లీకేజీ సంపూర్ణ సమాచారం.. సిట్ తో రేవంత్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పలువురు ప్రజాప్రతినిధులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ నోటీసులు అందుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొనే సిట్‌ విచారణకు హాజరైనట్లు తెలిపారు.

విచారణ అనంతరం బయటకు వచ్చిన రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ఆరోపణలు చేస్తున్న అందరికీ సిట్‌ నోటీసులు జారీ చేస్తోందని అన్నారు. అలా అయితే రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని  సిట్‌ దర్యాప్తు అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌కు విచారణ సందర్భంగా రేవంత్‌ చెప్పానని తెలిపారు. నేరస్థులను విచారించకుండానే కేటీఆర్‌ పూర్తి సమాచారం చెప్పారని వెల్లడించారు. కేటీఆర్‌ నుంచి సిట్‌ అధికారులు ఎందుకు సమాచారాన్ని సేకరించలేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

మరోవైపు పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా సిట్ అధికారులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే.