రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులోసిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులను సిట్ ఐదో రోజు ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో టీఎస్పీఎస్సీకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల నుంచి మంగళవారం కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు.. ఇవాళ కూడా అదే రీతిలో కొత్త విషయాలు తెలుసుకున్నారు.
ఈ కేసులో తాజాగా టీఎస్పీఎస్సీ కమిషన్‌లోని దాదాపు 40 మంది సిబ్బందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కమిషన్‌లోని మొత్తం 10 మంది ఉద్యోగులు పరీక్ష రాసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే గ్రూప్-1 పరీక్ష రాసిన ఉద్యోగులతో పాటు మిగిలిన వాళ్లకు కూడా నోటీసులు అందించారు. ఈ గ్రూప్-1 పేపర్ లీకేజీతో నిందితులు బాగానే లబ్ధి పొందినట్లు సిట్ బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.
నిందితులు ఎవరెవరికి కాల్స్ చేశారనే కోణంలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులకు.. రేణుక, ఢాక్యానాయక్‌లు పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్లు అనుమానిస్తున్నారు. అయితే రేణుకా కాల్ డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు సమాచారం.