ఈనెల 28నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. జనవరి 6వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సభలు నిర్వహించి ఆరుగ్యారంటీలకు దరఖాస్తుతో వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ సభల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభిస్తారు. పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ సభకు ముందు రోజునే దరఖాస్తులను గ్రామాలకు పంపిస్తారు.
గ్రామసభ ప్రారంభం కాగానే ముందుగా ప్రభుత్వ ఉద్దేశాలను చదివి వినిపిస్తారు. దరఖాస్తులో ఆధార్, రేషన్ కార్డు, క్రిమినల్ కేసులు తదితర వివరాలు నింపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఏయే పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారునే వివరాలు దరఖాస్తులో స్వీకరిస్తారు. సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపిస్తే అర్హులకు మంజూరు చేస్తారు.
దరఖాస్తులతో పాటు ప్రజల నుంచి ఇతర ఫిర్యాదులు, వినతులను కూడా అధికారులు తీసుంటారు. ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నంబరు కేటాయించి కంప్యూటరీకరిస్తారు. గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు, వాటిలో వివరాల ఆధారంగా ఆరుగ్యారంటీలను ఎందరు ఆశిస్తున్నారు. వారిలో ఎంతమంది అర్హులో తేల్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.