తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు పునరావాసం, భూసేకరణ విభాగ డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు రజత్ కుమార్ పర్యవేక్షించిన అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి రాష్ట్ర సర్కార్ అప్పగించింది. రజత్ కుమార్ ఇంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించనున్నారో తెలియాల్సి ఉంది.
మరోవైపు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నూతన కమిటీని కేంద్ర సర్కార్ నియమించింది. కేంద్ర జల సంఘంలో డిజైన్స్ సీఈ (వాయవ్య, దక్షిణ మండల) అనిల్ జైన్‌ను ఛైర్మన్‌గా, జె.చంద్రశేఖర్ అయ్యర్, నవీన్ కుమార్, ఎస్కే సిబల్‌లను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.