తెలంగాణలో ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆయా పంచాయతీల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 12,770 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శులు, కార్మికులతో పాటు మిషన్ భగీరథ సిబ్బందికి భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు.
మరోవైపు పంచాయతీల ప్రత్యేకాధికారులకు తమ విధులు బాధ్యతలపై పునరుశ్చరణ తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సీతక్క సూచించారు. ఈనెల 7 నుంచి జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని శ్రద్ధతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను, మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు శుభ్రం చేయాలని, ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని, ప్లాస్టిక్ నిషేధంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. బాగా పనిచేసిన వారిని జిల్లా స్థాయిలో ఎంపికచేసి సన్మానించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.