గత ఏడాదిన్నర కరోనా మహమ్మారి విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా దెబ్బకు విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడ్డాయి. ఇక తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతిలోనే ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగిసింది. తెలంగాణలో ఏప్రిల్ 26తో ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగిసిందని రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 25న ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యా శాఖ వెల్లడించింది.
అయితే మే 31తో ముందుగా ప్రకటించిన వేసవి సెలవులు ముగియగా కరోనా ప్రభావం తగ్గకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులను పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా కరోనా ప్రభావంతో ఏడాదిన్నరగా విద్యా సంస్థలు అన్ని మూతపడ్డాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి సమయంలో కరోనా ఉద్ధృతి తగ్గిందని భావించి విద్యా సంస్థలను పునఃప్రారంభించగా… మార్చి చివరలో కరోనా ఉప్పెనల ఎగిసి పడింది. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు విద్యా సంస్థలను మూసేసాయి. ఇక ఏడాదిగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నా వాటి వల్ల పెద్దగా ఫలితం ఏమీ లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో విద్యార్థులపై భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.