తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగింది. గ్రూప్-1 నియామకాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టి ఈ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. దీంతో నియామకాలకు అడ్డంకి తొలగినట్లయింది. ఇప్పటికే గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసిన టీజీపీఎస్సీ ..త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.
ఇక దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. మరోవైపు మార్చి 30వ తేదీన గ్రూప్-1 జీఆర్ఎల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో తమ ర్యాంకులను చూసుకోవచ్చని తెలిపింది.