కుటుంబ డిజైన్ డిజిటల్ కార్డులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిజిటల్ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే సర్వేలో భాగంగా ఆ కుటుంబం ఫోటో తీయాలని చెప్పారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని సూచించారు. కొత్త సభ్యులను చేర్చి చనిపోయిన వారిని తొలగించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై కసరత్తు వేగవంతం అయింది. ఇదే కార్డు అటు రేషన్ అవసరాలతో పాటు ఆరోగ్యము సంక్షేమ పథకాలకు కూడా వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ కార్డులపై కుటుంబ యజమానిగా మహిళా పేరునే పెట్టాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పట్టణ, మరో గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలట్ ప్రాజెక్టుగా అక్టోబర్ మూడు నుంచి కుటుంబాలను నిర్ధారించడానికి ఇంటింటి సర్వే చేసి వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు. పూర్తిగా గ్రామీణ స్వభావంతో కూడిన నియోజకవర్గాల్లో రెండు గ్రామాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో, పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.