ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే మోదీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఆయన స్పందిస్తూ.. బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని బీజేపీనే చెప్పిందని, 2018లోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంకేతాలు పంపారని తెలిపారు. దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా అని ప్రశ్నించారు.
మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కేటీఆర్ సీఎం కావడానికి ప్రధాన మంత్రి మోదీ అనుమతి అవసరం లేదని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మాట్లాడరు.. రాష్ట్రం హక్కుల గురించి ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే మోదీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని..బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.