తాండూరు గడ్డ కాంగ్రెస్ కు అడ్డా : రేవంత్ రెడ్డి

-

తాండూరు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీకి ద్రోహం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం తాండూరు నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలనివ్వనని, కార్యకర్తలపై చేయి వేస్తే.. ఊరుకునేది లేదన్నారు. తనకు కొడంగల్ ఎంతో.. తాండూరు కూడా అంతేనని చెప్పుకొచ్చారు. గజ్వేల్, సిద్దిపేటకు మాత్రమే నీళ్లు తెచ్చుకొని మన ప్రాంతానికి కేసీఆర్  అన్యాయం చేశారని విమర్శించారు రేవంత్ రెడ్డి. ముదిరాజ్ లకు కేసీఆర్ ఒక్కసీటు అయినా ఇచ్చారా ? ముదిరాజులు ఈ రాష్ట్ర ప్రజలు కారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

ఈటలపై కోపం ఉంటే ఇంకో ముదిరాజ్ నాయకుడికి ఇవ్వాల్సిందన్నారు. బీసీ మంత్రి ఈటల రాజీనామా చేస్తే.. మరో రెడ్డికి ఇచ్చారని విమర్శించారు. 9 మంది అగ్ర వర్ణాల వారు మంత్రులుగా ఉన్నా.. నేడు మరో పెద్ద రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. అసదుద్దీన్ కి సీఎం కేసీఆర్ ఏం చేశారో ఏమో.. మళ్లీ కేసీఆర్ ని గెలిపించినందుకు పని చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, మోడీ, అసదుద్దీన్ అందరూ ఒక్కటేనని.. ఓటు ఎవ్వరికేసినా వారికేసినట్టేనని పేర్కొన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చేవెళ్ల సభను విజయవంతం చేయడానికీ అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version