తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మూడోరోజు ముగిశాయి. ఇవాళ్టి సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని ఉత్తమ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల అప్పగింతపై సభ్యులు చేసిన సూచనల, సలహాలు కచ్చితంగా స్వీకరిస్తామని తెలిపారు. తెలంగాణకు జరగాల్సిన కేటాయింపులపై పోరాడతామని స్పష్టం చేశారు. రేపు మేడిగడ్డ సందర్శనకు సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సందర్శనకు రావాలని అందరికీ లేఖలు పంపానని తెలిపారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానం అని మన్నించి అందరూ రావాలని కోరారు.
ఠప్రతిపక్షాలు చేసిన సలహాలు, సూచనలను మేం స్వీకరిస్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము సరిచేస్తాం. మా ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు. ఇక ముందు కూడా చేయబోదు. రాష్ట్ర హక్కులపై పోరాడడానికి మా ప్రభుత్వం ముందు ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించం.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.