తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొత్తం 49 కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం తొలుత తెలియనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చార్మినార్‌లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉన్నందున మిగిలిన రెండింటి కంటే దాని ఫలితమే మొదట తెలుస్తుందని అంటున్నారు.
ఇవాళ ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం 8.30 గంటల నుంచి కౌంటింగ్ షురూ అవనుంది. పది గంటల నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అక్కడి ఫలితాలు కాస్త ఆలస్యంగా వెల్లడి కానున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఒక్కోచోట 500 నుంచి 600 వరకు పోలింగ్ కేంద్రాలు ఉండటమే దీనికి కారణమట.