తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో (2018) 73.37 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఈ ఏడాది పోలింగ్ శాతం తగ్గినట్లు చెప్పారు. ముఖ్యంగా క్రితం సారి లాగే ఈసారి కూడా హైదరాబాద్ మహానగరం పోలింగ్ శాతంలో చివరగా నిలిచింది. ఈసారి కూడా పల్లె ప్రజలు ఓటు వేయడానికి పోటెత్తగా పట్నం వాసులు మాత్రం బద్ధకించి ఇళ్లకే పరిమితమయ్యారు.
చెదురుమదురు సంఘటనలు మినహా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో కేవలం 46.56 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా నగరంలో ఓటింగ్ శాతం మెరుగుపరచలేకపోయామని పేర్కొన్నారు. మరోవైపు అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం ముఖ్యంగా మునుగోడులో గరిష్ఠంగా 9.51 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ యాకుత్‌పురలో 39.69 శాతం నమోదైనట్లు తెలిపారు.