గతంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెనక్కు పంపిన నాలుగు బిల్లులను తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో నాలుగు బిల్లులను శాసనసభ తిరిగి యథాతథంగా ఆమోదించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నాలుగు బిల్లులను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి మళ్లీ చర్చించారు.
పురపాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచాలని పురపాలక నిబంధనల చట్ట సవరణ తీసుకొచ్చామన్న మంత్రి కేటీఆర్… మైనార్టీలకు అదనంగా ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు పెరిగిన నేపథ్యంలో వైద్యవిద్యలో పాలనాపరమైన పోస్టులకు ఇబ్బందులు లేకుండా డీఎంఈ పదవీ విరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చామన్న మంత్రి హరీశ్ రావు… మళ్లీ ఎవరినో తీసుకొచ్చి నియామకం చేస్తారన్న అపోహ తగదని చెప్పారు.
మరోవైపు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు ఉండాలని పలువురు సభ్యులు కోరారు. భద్రాచలాన్ని మూడుగా విభజించి ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా ఒకటిగానే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. నాలుగు బిల్లులకు శాసనసభ మరోమారు ఆమోదముద్ర వేసింది. సభ్యులకు గవర్నర్ పంపిన సందేశాలకు సభ తీసుకున్న నిర్ణయం వర్తిస్తుందని, నాలుగు బిల్లులను పున:పరిశీలించి ఆమోదించినట్లు శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.