తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవలే అసెంబ్లీ సమావేశం అయింది. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ వాయిదా పడింది. తిరిగి ఇవాళ మళ్లీ శాసనసభ సమావేశం కాబోతోంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రారంభం అవుతుంది. గత సమావేశంలో ప్రొటెం స్పీకర్‌తో కలిపి 101 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ క్రమంలో ఇవాళ ప్రొటెం స్పీకర్ మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత సభాపతి ఎన్నిక జరగనుంది. సభాపతి ఎన్నిక దృష్ట్యా శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అనంతరం ఉభయసభ సభ్యులను ఉద్దేశించి రేపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు.
శాసనసభ అనంతరం నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రివర్గ భేటీ జరుగుతుంది. ఈ భేటీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.