తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల తరువాత ఆయన తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు అందజేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే కాంగ్రెస్ ఎల్పీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు అందరు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్‌నే స్పీకర్‌గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రసాద్ కుమార్‌కు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.