తెలంగాణ భూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ, భూభారతి చట్టాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, ఈ నెల 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మండలంలో ఈ రెవెన్యూ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత నెలలో నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో నిర్వహించిన ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.
ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం ప్రజల్లో భూభారతి చట్టంపై అవగాహన పెంపొందించడం, అలాగే ప్రజల భూ సమస్యలపై ప్రత్యక్షంగా వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించడం అని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఈ రెవెన్యూ సభలకు హాజరై, ప్రజల సందేహాలను సరళమైన భాషలో వివరించి, తక్షణమే పరిష్కార మార్గాలు సూచించాలని మంత్రి సూచించారు. భూభారతి చట్టాన్ని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఉద్బోధించారు.
భూమి వ్యవహారాలు తెలంగాణ సమాజానికి ఎంతో కీలకమైన అంశమని, గత ప్రభుత్వ ధరణి వ్యవస్థ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి విమర్శించారు. దురుద్దేశ్యంతో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ ప్రజల భూహక్కులను ధ్వంసం చేసిందని, రైతుల పరిస్థితి దిగజారిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ పెద్దలే ధరణిని దందాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శనంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, ఇది రైతుల కళ్లలో ఆనందం పుట్టించేలా రూపొందించామని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనలో భూ సమస్యల పరిష్కారానికి కోర్టు మార్గమే మిగిలిపోయిందని, ఇకపై అధికార యంత్రాంగమే గ్రామస్థాయిలోనే రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆయన భరోసా ఇచ్చారు. భూభారతి చట్టాన్ని ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల మరియు అధికారుల సహకారంతో విజయవంతంగా అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.