తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తపిస్తున్న బీజేపీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త ఢీలా పడింది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారడంతో పార్టీలో కళ తప్పింది. ఇంకోవైపు అధిష్ఠానం కూడా రాష్ట్రంపై తన ఫోకస్ తగ్గించింది. దీనికి తోడు కవిత కేసు అంశంపై ఎలాంటి స్పష్టత రాకపోవడం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే చర్చ ప్రజల్లోకి వెళ్లడంతో వలస నేతలు పలువురు సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామే అని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ శివారు గండిపేటలోని ఓ వ్యవసాయక్షేత్రంలో అసంతృప్త బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవడం చర్చకు దారితీసింది.
ఈ సమావేశానికి పలువురు మాజీ ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీలో బీజేపీలో తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ నాయకత్వం సీరియస్‌గా లేదని పలువురు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో కీలక పదవిలో ఉన్నవారు కొందరు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని .. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకపోవడంపై చర్చించినట్లు తెలిసింది. రేపో, మాపో దిల్లీ వెళ్లి హైకమాండ్‌ను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.