తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టింది. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు పద్దును ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లు, ఆరు గ్యారెంటీలకు రూ.53,196 కోట్లు కేటాయించారు.
ఇతర శాఖల కేటాయింపులు ఇవే..
వ్యవసాయానికి రూ.19,746 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
వైద్య రంగానికి రూ.11.500 కోట్లు
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.