రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో సిటీలో సుస్థిర పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, సివిల్ కోర్టుల చట్ట సవరణ, తెలంగాణ చట్టాల బిల్లులు కూడా శాసనసభలో చర్చకు రానున్నాయి. శాసనమండలి, శాసనసభ రెండిట్లోనూ ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.
శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ అనంతరం మండలిలోను చర్చించి ఆమోదించుకోవాల్సి ఉంది. నేడు ఉదయం 9 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. తర్వాత మధ్యహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి భూమి పూజ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారు.