నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర కేబినెట్ కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆరు గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుండగా.. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో రెండు రోజుల క్రితం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధివిధానాలపై నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. దారిద్య్ర రేఖకు దిగువన.. బీపీఎల్ ఉన్న వారికే రేషన్ కార్డులు ఇవ్వాలని మొదట నిర్ణయించినా.. బీపీఎల్ను పునర్నిర్వచించే అవకాశం ఉంది. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు వరకు కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉంది.