ఇవాళో, రేపో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనుకున్న ఆశావహులకు ఏఐసీసీ చిన్న షాక్ ఇచ్చింది. ఈ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తూ కొంతకాలం పుల్‌స్టాప్ పెట్టింది. మరోవైపు పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తుకు తెరపడినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణపై.. రాష్ట్ర నాయకత్వంతో జరిగిన విస్తృత చర్చలతో పార్టీ అధినాయకత్వం తుది నిర్ణయానికి రాలేకపోవడంతో ఈ అంశానికి కొంతకాలం ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నందున.. పార్టీ పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని భావిస్తున్న ఏఐసీసీ.. సర్కార్‌తో సమన్వయం, విపక్షాల విమర్శలకు దీటుగా బదులిచ్చేలా పీసీసీ కార్యవర్గ కూర్పు కోసం యత్నిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాకుండా మరో 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇంకా ఆరుగురికి అమాత్య యోగం దక్కనుంది. సామాజిక సమీకరణాలు కుదరకపోవడం, పదవుల విషయంలో ఏకాభిప్రాయం రాక క్యాబినెట్ విస్తరణ ఆగినట్లు సమాచారం. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ, పీసీసీలు యోచించాయి. ఆరింటిలో రెండు మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన నాలుగింటిలో ఒకటి మైనారిటీకి.. రెండు బీసీలకు ఇవ్వాలని, ఇంకొకటి ఎస్టీకి ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.