రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐటీ హబ్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నల్గొండలో ఐటీ టవర్ రాబాతోంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని నిరుద్యోగులకు ఐటీ ఉపాధి సేవలు అందించాలనే లక్ష్యంతో నల్గొండలో ఐటీ టవర్ ఏర్పాటు చేశారు. ఈ టవర్ ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే నెల 2వ తేదీన ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.
ఈ టవర్ నిర్మాణానికి 2021 డిసెంబరు 31వన మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే తొలి దశలో 17 కంపెనీలు సుమారు 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చి తమ కంపెనీల కార్యకలాపాలు ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ఒక షిప్ట్‌లో సుమారు 1200 మంది ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తుండగా.. ఏడాదిలో రెండు షిఫ్ట్‌లు, ఏడాదిన్నరలో మూడు షిఫ్ట్‌లు.. పనిచేసే విధంగా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని తెలిసింది.
రోజంతా సహజసిద్ధంగా వెలుతురూ వచ్చేలా భవనాన్ని G+5 పద్ధతిలో గ్రీన్ బిల్డింగ్ తరహాలో నిర్మించారు. భవనంలో ఉపయోగించిన నీటిని పూర్తిగా తిరిగి ఉపయోగించేలా 50 వేల లీటర్ల సీవరేజ్ ప్లాంటును నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటూ రెండో అంతస్థులో ఇంటర్నల్ గార్డెన్‌ను తీర్చిదిద్దుతున్నారు.