తెలంగాణ మంత్రి వర్గ ఉప సంఘం ఇవాళ బీర్కే భవన్ లో సమావేశమైంది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీపై చర్చించింది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేసి.. వారం రోజుల్లో పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది.
పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి, పంపిణీకి సిద్ధం చేయాలని ఉపసంఘం అధికారులకు స్పష్టం చేసింది. కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహించి ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చూడాలన్న ఉపసంఘం… దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి, వారి జీవితాల్లో ఆనందం నింపాలని తెలిపింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపైనా సబ్ కమిటీ చర్చించింది. ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్ఏను ఆదేశించింది.