మునుగోడు ఉప ఎన్నికపై 28 ఫిర్యాదులు : సీఈవో

-

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్​ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. మునుగోడు ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వికాస్ రాజ్ సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. ఇవాళ రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లాడినట్లు సీఈవో తెలిపారు. ఫిర్యాదు వచ్చిన సామాజిక మాధ్యమాల లింకుల ద్వారా విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగినట్లు చెప్పారు. పోలీసులు వెంటనే కలగజేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టారని తెలిపారు.

ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారనే, పోలింగ్‌ కేంద్రాల వద్ద గుర్తులు ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో తెలిపారు. పోలీసులు ఇప్పటి వరకు 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version