తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు స్థలాలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్ లేదు. ఆయన జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. అక్కడ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే గచ్చిబౌలి, రాయదుర్గం, ఖాజాగూడ ప్రాంతాల్లో సీఎం క్యాంపు ఆఫీసు కోసం స్థలాల పరిశీలనపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసే ప్రాంతంలో సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ఆయన కాన్వాయ్ సులువుగా బాహ్యవలయ రహదారిని వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలా? లేదంటే అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేయాలా? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీఎం క్యాంప్ కార్యాలయం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకూడదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నందున శేరిలింగంపల్లి మండలంలో బాగుంటుందన్న భావనతోనే రెవెన్యూ అధికారులు స్థలాల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది.