యాదాద్రిలో కార్తిక మాసం ఆదాయం రూ.14.91 కోట్లు

-

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి నిత్యం భక్తులు పోటెత్తుతూనే ఉంటారు. ఇక కార్తీక, శ్రావణ మాసం వంటి ప్రత్యేక రోజుల్లో భక్తుల తాకిడి ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రత్యేక రోజుల్లో ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక ఆలయ సిబ్బంది భారీగా తరలి వచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంటారు. ఇలా రద్దీ ఎక్కువవ్వడంతో పాటు ఈ ప్రత్యేక రోజుల్లో యాదాద్రి హుండీకి ఆదాయం కూడా భారీగానే వస్తుంది.

ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయ ఖజానాకు కార్తీక మాసంలో రూ.14.91 కోట్లు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గతనెల 14న మొదలైన కార్తికం మంగళవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ మాసంలో శివ, కేశవుల ఆలయాలున్న ఈ క్షేత్రం సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు, దీపోత్సవం, తులసీ ఆరాధనలతో యాదాద్రి కిటకిటలాడింది.

కార్తీక మాసం తొలిరోజు నుంచి రోజూ ఆరు సార్లు నిర్వహించిన సామూహిక వ్రతాల్లో 18,824 మంది దంపతులు పాల్గొనగా.. ఈ పూజలతో రూ.1,64,20,600 సమకూరాయని ఆలయ ఈవో గీత తెలిపారు. 37,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,50,79,660, బ్రేక్‌, శీఘ్ర దర్శనాలతో రూ.1,69,19,100, కొండపై వాహనాల పార్కింగ్‌ రుసుం ద్వారా రూ.1,13,50,000 వచ్చాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news