హైదరాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) కుటుంబం కాశీ యాత్రకు బయలుదేరింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గురువారం వారు వారణాసి చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కేసీఆర్ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవితా సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ కుటుంబం రెండు రోజుల కాశీ యాత్రలో భాగంగా పుణ్యక్షేత్రమైన వారణాసిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొదటగా అస్పి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు పడవ ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతి, గంగా పూజను తిలకిస్తారు. అనంతరం అస్సి ఘాట్‌కు బోటులో తిరుగు ప్రయాణం కానున్నారు. అటునుంచి సంకట్మోచన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని సమాచారం. రేపు కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది.
ఈ కాశీ పర్యటన గురించి తాజాగా ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథున్ని కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకోబోతుండటం సంతోషంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే, తన కుటుంబ సభ్యులతో కూడిన ఓ ఫోటోను షేర్ చేశారు.