తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కేసు సీఐడీకి బదిలీ

-

తెలంగాణలో నకిలీ రసీదులు సృష్టించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. అయితే ఈ కేసును తాజాగా నగర సీసీఎస్‌ నుంచి సీఐడీకి బదిలీ చేసినట్టు సమాచారం. గత నెలలో సీఎం సహాయనిధి దరఖాస్తులు పరిశీలిస్తున్న సచివాలయ రెవెన్యూ విభాగ అధికారులకు 4 నకిలీ రసీదులు కనిపించాయి. అదేనెల 21న సైఫాబాద్‌ పోలీసులు దీనిపై కేసు నమోదుచేసి.. తర్వాత సీసీఎస్‌కు బదిలీ చేశారు.

దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు మిర్యాలగూడ, ఖమ్మం పట్టణాల్లోని 2 ఆసుపత్రుల నుంచి రూ.8 లక్షల నకిలీ బిల్లులను గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవంతో మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొందరికి డబ్బు ఆశ చూపి ఆధార్‌ కార్డులు తీసుకొని, వారి పేర్లతో దరఖాస్తు చేసినట్లు తేలింది. మిర్యాలగూడ, ఖమ్మం జిల్లాల్లోని ఆసుపత్రుల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించినట్లు తొలుత భావించిన పోలీసులు. తాజాగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యుల పేర్లతోనూ సహాయ నిధికి దరఖాస్తులు వచ్చినట్లు తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news